
సాగర్ మానేటి న్యూస్ కమలాపూర్/
కరీంనగర్, నవంబర్ 1:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పెన్షనర్లకు పెన్షనరీ బెనిఫిట్స్ చెల్లించాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ (టా ప్ర) కరీంనగర్ జిల్లా శాఖ నాయకులు డిమాండ్ చేశారు.
జిల్లా అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్, ప్రధాన కార్యదర్శి గడ్డం అశోక్, గౌరవాధ్యక్షుడు కట్ట నాగభూషణాచారి సంయుక్త ప్రకటనలో మాట్లాడుతూ – ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ఎలాంటి ఇబ్బంది కలిగించబోమని హామీ ఇచ్చినప్పటికీ, ఆచరణలో మాత్రం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.
వారు తెలిపారు – 2024 ఏప్రిల్ నుండి పదవీ విరమణ పొందిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు రావలసిన కమ్యూటేషన్, గ్రాచ్యుటీ, జిపిఎఫ్ వంటి పెన్షనరీ బెనిఫిట్స్ ఇప్పటికీ చెల్లించకపోవడం విచారకరమని అన్నారు. కోర్టుకు వెళ్లిన కొంతమందికి మాత్రమే ఫైల్ ఆధారంగా చెల్లించడమే తప్ప, మిగిలిన పెన్షనర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది ప్రభుత్వ నిర్లక్ష్యమేనని వారు తీవ్రంగా విమర్శిస్తూ – వెంటనే పెన్షనరీ బెనిఫిట్స్ విడుదల చేసి, అన్ని పెన్షనర్లకు చెల్లించాలన్నారు.
అదే విధంగా, పెండింగ్లో ఉన్న ఐదు డీఏలు (Dearness Allowances) వెంటనే విడుదల చేయాలని, నూతన పీఆర్సీ (PRC) ని ప్రకటించి 2023 జూలై నుండి అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం ఈ అంశాలను తక్షణమే పరిష్కరించకపోతే, రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు ఆందోళన కార్యక్రమాలు చేపట్టి, ప్రభుత్వం తీరుకు కనువిప్పు కలిగించేలా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.