మానేటి న్యూస్ కరీంనగర్ అక్టోబర్ 28/
కరీంనగర్ జిల్లాలోని ఒక పాఠశాలలో మైనర్ విద్యార్థినులపై అసభ్య ప్రవర్తన చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.ఆ పాఠశాలలో ఆఫీస్ సబార్డినేట్ / అటెండర్‌గా పనిచేస్తున్న మహ్మద్ యాకూబ్ పాషా (30), తండ్రి: మహ్మద్ మొహినుద్దిన్, స్వగృహం: శాయంపేట గ్రామం, గీసుకొండ మండలం, ప్రస్తుత నివాసం: కురిక్యాల గ్రామం, గంగాధర మండలానికి చెందిన వ్యక్తి.గత కొన్ని రోజులుగా పాఠశాలలో చదువుతున్న మైనర్ విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ, వారి సున్నిత శరీర భాగాలను తాకడం, మరియు సెలబ్రేషన్స్ సందర్భంగా విద్యార్థినులతో దిగిన ఫోటోలను మార్ఫింగ్ చేసి బెదిరించడం వంటి ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.ఈ అంశంపై జిల్లా చైల్డ్ & మహిళా సంక్షేమ అధికారి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు, మండల విద్యాధికారి, ఎంపీడీవో లు సంయుక్తంగా పాఠశాలను సందర్శించి, విద్యార్థినులతో విచారణ జరిపారు. విచారణలో ఆరోపణలు నిజమని నిర్ధారణ కావడంతో, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు 27-10-2025 సాయంత్రం 5 గంటలకు గంగాధర పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.ఫిర్యాదుపై పోలీసులు పీఓసీఎస్ఓ, ఐటీ యాక్ట్ మరియు ఇతర కఠిన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు బాధ్యతను కరీంనగర్ రూరల్ ఏసీపీ జి. విజయకుమార్ స్వయంగా చేపట్టారు. దర్యాప్తులో నిందితుడు పాఠశాలలో చదువుతున్న విద్యార్థినులపై లైంగిక దాడులకు పాల్పడినట్లు తేలింది.దీంతో గంగాధర ఎస్‌ఐ మరియు పోలీసులు నిందితుడిని వెతికివెళ్లి, 28-10-2025 ఉదయం 10.15 గంటలకు కరీంనగర్ రేకుర్తి చౌరస్తా వద్ద మహ్మద్ యాకూబ్ పాషాను అరెస్టు చేసి, వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపర్చగా రిమాండుకు పంపించారు.మైనర్ అమ్మాయిలు మరియు మహిళలపై లైంగిక వేధింపులు లేదా దాడులకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని, అలాగే ఇలాంటి వేధింపులు ఎదురైన వారు నిర్భయంగా పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చని, బాధితుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయని కరీంనగర్ రూరల్ ఏసీపీ జి. విజయకుమార్ తెలిపారు.











