
పడిపూజలో పాల్గొననున్న కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్.
మానేటి న్యూస్ కరీంనగర్ డిసెంబర్ 02/
కరీంనగర్ లోని ముగ్గురు అమ్మవార్లు శ్రీ మహాదుర్గ, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతిల మహిమాన్విత దివ్య క్షేత్రం లో ఈనెల (డిసెంబర్) 6వ తేదీన శ్రీ అయ్యప్ప స్వామి పడిపూజ ను నిర్వహించనున్నారు. శ్రీ శ్రీ శ్రీ జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య భారతి స్వామి దివ్య ఆశీస్సులతో ఇట్టి పడిపూజ మహోత్సవ వేడుకలను కావేటి పరమేశ్వర్ గురుస్వామి ఆధ్వర్యంలో నిర్వహించడానికి ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. 6 వ తేదీ శనివారం సాయంత్రం 6 గం.లకు జరిగే పడిపూజ కార్యక్రమంలో కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ పాల్గొననున్నారు. పడిపూజ అనంతరం స్వాములకు అల్పాహారం అందించడానికి తగిన ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. సమస్త జీవకోటిలో మానవజన్మ శ్రేష్టమైనది. తన జన్మను సార్ధకత చేసుకోవాలంటే, ముక్తిని సాధించాలనే ఉద్దేశంతో తీసుకునే దీక్ష “అయ్యప్ప స్వామి” దీక్ష. కలియుగంలో ఉత్తమమైన దీక్షగా భావించి కఠిన నియమాలను అనుసరిస్తూ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ నియమనిష్ఠలతో దీక్షను కొనసాగిస్తూ స్వామిని దర్శించే గొప్ప దీక్ష , గురు స్వామి మాటపై గురి కలిగి ఉండే దీక్ష , గురువుపై భక్తిని కలిగి ఉండే దీక్ష , బ్రహ్మ, విష్ణు, శివుల ప్రతిరూపముగా భావించి గురువు పైన విశ్వాసం కలిగి ఉండే దీక్ష “అయ్యప్ప స్వామి దీక్ష” , కులము, మతము, జాతి అనే భేదం లేకుండా తీసుకునే ఏకైక దీక్ష “అయ్యప్ప దీక్ష”. శ్రీ అయ్యప్ప స్వామి కరుణాకటాక్షాలు సమస్త భక్తజనులు, అయ్యప్ప దీక్షపరుల పట్ల ఉండాలనే సంకల్పంతో శ్రీ మహాశక్తి దేవాలయంలో చేపట్టనున్న ఈ పడిపూజ మహోత్సవ వేడుకకు హిందూ బంధువులందరూ తరలివచ్చి ఆ స్వామి కృపకు పాత్రులు కాగలరని ఆలయ నిర్వాహకులు కోరారు.