X

సమాచార హక్కు చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్న అధికారులు..సమాచార హక్కు చట్టం సాధన కమిటీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు డాక్టర్.చంటి ముదిరాజ్..

సాగర్ మానేటి న్యూస్ కమలాపూర్/

ప్రభుత్వ పాలనలో పాదర్శకతను పెంపొందించి, పరిపాలనా వ్యవహారాల్లో గోప్యతను నివారించి, ప్రభుత్వ పాలనా విధానాలను ప్రజల ముందు ఉంచేందుకు పౌరులకు కల్పించిన అద్భుత అవకాశమే సమాచార హక్కు.

ప్రభుత్వ పాలనలో పాదర్శకతను పెంపొందించి, పరిపాలనా వ్యవహారాల్లో గోప్యతను నివారించి, ప్రభుత్వ పాలనా విధానాలను ప్రజల ముందు ఉంచేందుకు పౌరులకు కల్పించిన అద్భుత అవకాశమే సమాచార హక్కు. సమాచారాన్ని ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత అయితే దాన్ని పొందడం పౌరుల హక్కు. ప్రభుత్వ పాలనలో బాధ్యతాయుత విధానానికి అవకాశాన్ని కల్పిస్తుంది. ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు అధికారుల పనితీరులో పారదర్శకత పాటించేందుకు తీసుకువచ్చిన సమాచార హక్కు చట్టం ప్రభుత్వ అధికారుల తీరుతో అభాసు పాలవుతుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు సమాచారం ఇచ్చేందుకు సమయం నిర్దేశించి ఇచ్చినప్పటికి అది అమలుకు నోచుకోవడం లేదు. సమాచారం కోసం పెట్టుకున్న దరఖాస్తులు వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయాయని సమాచారం. కోరిన సమాచారం కోసం దరఖాస్తు దారులు నెలల తరబడి కార్యాలయాల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నారని, అయినా అధికారుల నుంచి సమాధానం లేకపోవడంతో సమాచార హక్కు చట్టం వివిధ ప్రభుత్వ కార్యాలయంలో అమలు అవుతుందా..? లేక ప్రభుత్వ అధికారులను సమాచార హక్కు చట్టం నుంచి ఏమైనా ఉపేక్షించారా.. అనే సందేహాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.

అసంపూర్తి సమాచారంతో సర్దుబాటు..

సమాచార హక్కు చట్టం అమలులోకి వచ్చిన మొదట్లో ఎన్నో అవినీతి అక్రమాలు వెలుగు చూసి సామాన్యుడికి అదో బ్రహ్మాస్త్రంలా మారి అక్రమాలకు పాల్పడిన అధికారుల్లో గుబులు పుట్టించింది. మొదట్లో చట్టం అమలులో సైతం అధికారులు పారదర్శకంగా వ్యవహరించేవారు. ఏ అధికారైనా సమాచారం ఇచ్చేందుకు నిరాకరించిన ఇబ్బందికి గురి చేసిన చట్టప్రకారం చర్యలు ఉండేవి ఇప్పుడు పరిస్థితి మారిందని పలువురు అంటున్నారు. సమాచార హక్కు చట్టం ద్వారా ఏదైనా సమాచారం కోసం దరఖాస్తుదారుడు దరఖాస్తు చేసుకుంటే సంబంధిత అధికారులు సమాచారం ఇచ్చేందుకు నిరాసక్తత చూపిస్తున్నారని, సమాచారం ఇచ్చేందుకు సరిపడా సిబ్బంది లేరని కాలయాపన చేస్తున్నారని, లేదంటే సమాచారం మా వద్ద లభ్యం కావడం లేదంటూ సమాచారం ఇవ్వకుండా తప్పించుకుంటూ అధికారులు ఒక వేల తప్పని పరిస్థితుల్లో ఇవ్వాల్సి వచ్చినా పూర్తి సమాచారం ఇవ్వకుండా అసంపూర్తిగా సమాచారం ఇస్తూ తప్పించుకుంటున్నారని, ఇలా అసంపూర్తి సమాచారంతో దరఖాస్తు దారులు పూర్తి సమాచారం రాబట్టాలంటే నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగక తప్పడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ లోపు పుణ్యకాలం కాస్తా గడచిపోయి అధికారులు మారి ప్రభుత్వాలు మారి తప్పు చేసిన అధికారులు తప్పించుకుంటుండగా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ అభివృద్ధి పథకాల అమలులో పారదర్శకత లోపించి ప్రభుత్వం ఖర్చు చేస్తున్న లక్షల రూపాయలు దుర్వినియోగం అవుతూ అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిందని పలువురు ఆరోపిస్తున్నారు.

అక్రమాలు వెలుగులోకి రాకూడదనే చట్టం నిర్వీర్యం..

అధికారులు పాలకుల పనితీరులో పారదర్శకత లోపించి అక్రమాలకు పాల్పడుతుండటంతో సమాచార హక్కు చట్టం నిర్వీర్యం చేస్తున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అయితే సమాచార హక్కు చట్టం అమలులో ప్రభుత్వాలు సైతం దృష్టి సారించకపోవడంతో అధికారులు చట్టాన్ని అమలు చేసేందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కాగా గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్న పెద్దలు ప్రభుత్వాన్ని రాజ్యాంగ బద్ధంగా కాకుండా రాజరిక పాలన లాగా సాగించడంతో చట్టాలు అమలు కాక అడిగేవారు లేక అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మారిన అధికారులు తమ పద్ధతులు మార్చుకోకుండా గత ప్రభుత్వంలో వ్యవహరించిన మాదిరిగానే నాయకుల అండదండలతో గత ప్రభుత్వంలో ఎలా వ్యవహరించారో అదే మాదిరిగా ఇప్పుడు కూడా ప్రస్తుత రాజకీయ పెద్దల అండదండలతో ప్రభుత్వ అధికారులు అవినీతి అక్రమాలకు పాల్పడుతూ సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం దరఖాస్తుదారులకు ఇస్తే తమ అవినీతి అక్రమాల చిట్టా బయటకు తెలుస్తాయి. కాబట్టే ప్రభుత్వ అధికారులు సమాచారం దరఖాస్తు దారులకు ఇచ్చేందుకు వివిధ సాకులు చూపిస్తూ సమాచార హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారనే భావన సర్వత్రా వ్యక్తం అవుతుంది. మరి ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వ ఉన్నతాధికారులు సమాచార హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తారా లేక అవినీతి అక్రమాలు బయటపడకుండా సమాచార హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేస్తారో వేచి చూడాల్సిందే.

30 రోజులు గడిచిన సమాచారం ఇవ్వక పోవడానికి గల కారణం ఏమిటో..?

సామాన్య పౌరులు ఏదైనా కార్యాలయంలో సమాచారం అడిగితే సమాచార హక్కు చట్టం ప్రకారం 30 రోజుల్లో ఇవ్వాల్సి ఉండగా సుమారు 50-60 రోజులు గడుస్తున్న సమాచారం ఇవ్వడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్షేత్ర స్థాయిలో సమాచార హక్కు చట్టాన్ని అమలు చేయాల్సిన అధికారులు చట్టాన్ని అమలు చేసేందుకు విముఖత చూపిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. చట్టం అమలు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ సమాచార హక్కు చట్టాన్ని తుంగలో తొక్కుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. చట్టం అమలులో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటూ కఠినంగా వ్యవహరించాలని ఉన్నతాధికారులను ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు నిర్లక్ష్యం వీడకపోతే సమాచార హక్కు చట్టం అమలు కోసం ఉద్యమం చేయక తప్పదని. దీనిపై నిరంతర పోరాటం సాగిస్తామని సమాచార హక్కు చట్టం సాధన కమిటీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు డాక్టర్.చంటి ముదిరాజ్ మరియు సమాచార హక్కు చట్టం సాధన కమిటీ సభ్యులు అంటున్నారు.

Categories: Uncategorized
MaaNeti News Next:
Related Post