
మానేటి న్యూస్ కరీంనగర్ నవంబర్ 18/
తిమ్మాపూర్ మండలం మహాత్మా నగర్ (ఎల్ఎండి) గ్రామం భక్తజనంతో రానున్న మూడు రోజులు సందడిగా మారనుంది. గ్రామంలో నిర్మితమైన శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో ఈ నెల 21 నుంచి 23 వరకు ప్రతిష్ఠా మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. అయ్యప్ప, గణపతి, సుబ్రహ్మణ్య, నాగేంద్ర, పార్వతీదేవి, నవగ్రహ, శిఖరధ్వజ తదితర దేవతామూర్తుల ప్రాణ ప్రతిష్ఠ, మహాకుంభాభిషేకం కోసం దేవాలయ కమిటీ ఏర్పాట్లు వేగంగా పూర్తి చేస్తోంది.హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు శ్రీ శ్రీ విద్యారణ్య భారతి స్వామివారు స్వయంగా పాల్గొనడం ఈ వేడుకలకు ప్రధాన ఆకర్షణగా మారింది. వారి కరకమలములతో యంత్ర ప్రతిష్ఠ, ప్రాణ ప్రతిష్ఠ, మహాకుంభాభిషేకం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 21వ తేదీ ఉదయం మంగళ వాయిద్యాలు, చతూర్వేద స్వస్తి, పుణ్యాహవాచనంతో మహోత్సవాలు ప్రారంభమవుతాయి. యజ్ఞశాల ప్రవేశం, హోమకుండ సంస్కారం, నవగ్రహ–మాతృక–వాస్తు దేవతా స్థాపన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సాయంత్రం ప్రధాన దేవతా మూర్తుల జలాధివాసం, హారతి, తీర్థప్రసాదం భక్తులకు అందుబాటులో ఉంటుంది.నవంబర్ 22న స్థాపిత దేవతా పూజలు, వివిధ హవనాలు, రుద్రహవనం, మహాస్నపనం జరగనున్నాయి. 23వ తేదీ ఆదివారం ఉదయం బ్రహ్మశిల సంస్కారం, రత్న–దాతు–బీజన్యాసాలు అనంతరం మకర లగ్నంలో ఉదయం 10.20 గంటలకు ప్రాణ ప్రతిష్ఠ నిర్వహించనున్నారు. జయాది హోమం, పూర్ణాహుతి, మహాకుంభాభిషేకం, అలంకరణ, మహాహారతులతో ప్రతిష్ఠావేళ వైభవోపేతంగా సాగనుంది. సాయంత్రం మహా పడిపూజ అనంతరం అన్నప్రసాద విందు ఏర్పాటు చేసినట్లు కమిటీ తెలిపింది.అయ్యప్ప దీక్షలోని భక్తి, నియమ నిష్ఠ, గురుస్వామి అనుభవసారాన్ని భావితరాలకు అందించేలా ఈ దేవాలయం భక్తుల పాలిట దివ్యక్షేత్రంగా నిలుస్తుందని నిర్వాహకులు పేర్కొన్నారు. గురు స్వామి కావేటి పరమేశ్వర స్వామి పర్యవేక్షణలో జరుగుతున్న ఈ మహోత్సవాల్లో భక్తులు సకుటుంబ సమేతంగా హాజరవ్వాలని కమిటీ విజ్ఞప్తి చేసింది.