

ఈ కార్యక్రమాన్ని చేపట్టిన v6 జవాజి రాజు మరియు గ్రామస్తులు
సాగర్ మానేటి న్యూస్ కమలాపూర్
హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల భీంపల్లి గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తొలిసారిగా గ్రామ ప్రజలు సర్పంచ్ అభ్యర్థులను ఒకే వేదికపైకి రప్పించి, నేరుగా ప్రశ్నలు వేయడం గ్రామ రాజకీయాల్లో కొత్త చరిత్రను సృష్టించింది. ఊరి అభివృద్ధి, భవిష్యత్తు, పారదర్శకత, హామీల అమలుపై ప్రజలు నిష్పాక్షికంగా అభ్యర్థులను నిలదీసిన ఈ కార్యక్రమం గ్రామస్థులలో చైతన్యం పెంచింది.
ఈ కార్యక్రమాన్ని గ్రామంలోని యువత, పెద్దలు కలిసి రూపొందించగా, ప్రధానంగా సమన్వయం వహించినవారిలో V6 జవాజీ రాజు ప్రత్యేకంగా నిలిచారు. ప్రజల ముందు అభ్యర్థులను నిలబెట్టి, గెలుపు తర్వాత గ్రామానికి ఏమి చేస్తారనే విషయంపై స్పష్టమైన వివరాలు చెప్పించే ప్రయత్నం గ్రామంలో మంచి స్పందనను తెచ్చింది.
“జిల్లా–మండల స్థాయిలో భీంపల్లిని ఆదర్శ గ్రామంగా నిలబెడతాం. పార్టీలకు అతీతంగా ప్రతి కుటుంబాన్ని సమానంగా చూస్తాం” అని అన్ని అభ్యర్థులు వేదికపై ప్రజలకు హామీ ఇచ్చారు. ఎన్నికల తర్వాత మాటలు అమలు చేయకపోతే ప్రజాశక్తిరంగంలో నిలదీస్తామని గ్రామస్తులు స్పష్టంగా హెచ్చరించడంతో కార్యక్రమం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది.
అభ్యర్థులు తమ అభివృద్ధి ప్రణాళికలను వివరించారు. గ్రామంలో రహదారులు, తాగునీరు, పరిశుభ్రత, రైతు సమస్యలు, కమ్యూనిటీ అభివృద్ధి, యువత అవకాశాలపై చేపట్టబోయే చర్యల గురించి విపులంగా వివరించారు. ప్రజలు వేసిన ముఖసూటి ప్రశ్నలకు తగిన సమాధానాలు ఇస్తూ, “మా మాట మా కర్తవ్యం” అని అన్ని అభ్యర్థులు ప్రజలకు భరోసా ఇచ్చారు.
గ్రామ ప్రజలు భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ పేర్కొన్న “ఓటు ప్రతి పౌరుని ఆయుధం” అనే భావాన్ని ప్రస్తావిస్తూ, ఈ ఆయుధాన్ని సరైన అభ్యర్థిని ఎంచుకోవడానికి వినియోగించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అక్కినపల్లి రమేష్, తిరుపతి బిక్షపతి, వాసాలా శ్రీనివాస్, జవాజీ కనకయ్య, సముద్రాల మొగిలి, తోట శంకరయ్య, బైస శ్రీనివాస్, భూపతి ప్రవీణ్, బోయిని సంపత్, తాళ్లపల్లి గణేష్, బచ్చల శ్రీకాంత్, కుక్కల ఓదెలు, కురిమిళ్ళ సంతోష్, బొంకురి రమేష్ తదితర గ్రామ పెద్దలు, యువత భారీగా పాల్గొన్నారు.
గ్రామ అభివృద్ధి కోసం ప్రజలు స్వయంగా ముందుకు రావడం, అభ్యర్థులను నేరుగా ప్రశ్నించడం గ్రామంలో కొత్త రాజకీయ సంస్కృతికి నాంది పలికినట్లుగా భావిస్తున్నారు.