సాగర్ మానేటి న్యూస్, కమలాపూర్ అక్టోబర్ 28/

కమలాపూర్ మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదాలను అరికట్టే లక్ష్యంతో పోలీసులు సుదీర్ఘ తనిఖీలు నిర్వహించారు. కమలాపూర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ హరికృష్ణ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది భారీగా వాహనాలను తనిఖీ చేశారు. ప్రతి వాహనదారుడి వద్ద లైసెన్స్, వాహన పత్రాలు, ఇన్స్యూరెన్స్ వంటి వివరాలను పరిశీలించారు.ఈ సందర్భంగా తాగి వాహనాలు నడిపే వ్యక్తులపై డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేశారు. పోలీసులు బ్రీత్ అనలైజర్ యంత్రాలతో పరీక్షలు చేపట్టి, మద్యం సేవించి వాహనం నడిపిన వారిని హెచ్చరించారు.సీఐ హరికృష్ణ మాట్లాడుతూ — “రోడ్డు ప్రమాదాలు నివారించాలంటే ప్రతి ఒక్కరూ నిబంధనలు కచ్చితంగా పాటించాలి. మద్యం సేవించి వాహనం నడిపితే కేవలం చట్టపరమైన శిక్షలు మాత్రమే కాదు, మీ జీవితాన్ని కూడా ప్రమాదంలో పడేస్తుంది” అని అన్నారు. అలాగే యువతను ఉద్దేశించి మాట్లాడుతూ, “తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదు. వాహనం నడిపే ముందు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ మరియు పత్రాలు వెంట ఉంచుకోవాలి. హెల్మెట్, సీటు బెల్ట్ వంటి రక్షణ సాధనాలు తప్పనిసరిగా వాడాలి” అని సూచించారు.ప్రజల ప్రాణ భద్రతే తమ ప్రధాన ధ్యేయమని సీఐ హరికృష్ణ తెలిపారు. రాబోయే రోజుల్లో మరింత కఠినమైన తనిఖీలు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. పోలీసులు ప్రజలకు అవగాహన కల్పిస్తూ, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Leave a Reply