ఎకరాకు రూ.30 వేల నష్టపరిహారం చెల్లించాలి..

మానేటి న్యూస్ కరీంనగర్ నవంబర్ 01:
అకాల వర్షాల కారణంగా తీవ్ర నష్టాలు ఎదుర్కొన్న రైతులను ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఆదుకోవాలని, తడిసిన ధాన్యాన్ని ఏ కండిషన్లో ఉన్నా వెంటనే కొనుగోలు చేయాలని బిజెపి కొత్తపల్లి మండల అధ్యక్షుడు కుంట తిరుపతి డిమాండ్ చేశారు.శనివారం ఆయన ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ఎదుట రైతుల ఆందోళన కార్యక్రమం నిర్వహించి, ఎమ్మార్వోకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కుంట తిరుపతి అన్నారు మెంథా తుఫాన్ రైతుల కష్టాన్ని కన్నీళ్లుగా మార్చింది. చేతికి వచ్చిన పంట నీటిలో మునిగిపోయింది. వడ్ల కుప్పలు వరద నీటిలో కొట్టుకుపోయి రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు అని ఆవేదన వ్యక్తం చేశారు.రైతులు యూరియా, విత్తనాల కొరతతో ఇబ్బంది పడుతుండగా, రైతు భరోసా నిధులు ఆలస్యమవడంతో ఇప్పటికే కష్టాల్లో ఉన్నారని, ఇప్పుడు తుఫాన్ దెబ్బతో వారి బాధ వర్ణాతీతంగా మారిందని ఆయన అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం పంట కొనుగోలులో చూపుతున్న నిర్లక్ష్యం రైతులకు మరింత నష్టాన్ని తెచ్చిపెడుతోందని విమర్శించారు.బిఆర్ఎస్ ప్రభుత్వం కాలంలో ఉన్నట్లే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రైతుల పట్ల అదే నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శిస్తోంది,” అని ఆయన అన్నారు.తక్షణమే ప్రతి ఎకరాకు రూ.30 వేల నష్టపరిహారం చెల్లించాలని, తడిసిన పంటను తాలూ, తరుగు, తేమ పేరిట తిరస్కరించకుండా ప్రభుత్వం నేరుగా కొనుగోలు చేయాలని కుంట తిరుపతి డిమాండ్ చేశారు.