మానేటి న్యూస్ కరీంనగర్ అక్టోబర్ 30/
బుధవారం కురిసిన అకాల వర్షానికి మండలంలో నష్టపోయిన రైతులను యుద్ధ ప్రాతిపదికన ఆదుకోవాలని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో తడిసిన ధాన్యాన్ని వెంటనే తూకం వేయాలని బిజెపి మండల అధ్యక్షుడు ఎనుగుల అనిల్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో కొట్టుకుపోయిన ధాన్యాన్ని పరిశీలించి, పై నుండి వస్తున్న వాగు ఉధృతి పెరగడంతో మార్కెట్ యార్డులోకి కూడా నీళ్లు వచ్చి రైతుల ధాన్యం మొత్తం కొట్టుకపోవడంతో రైతులు విలపించగా వారిని ఓదార్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ యంత్రాంగం వెంటనే స్పందించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, తడిసిన ధాన్యాన్ని వెంటనే తూకం వేయాలని, మండలంలో పలు గ్రామాల్లో చేతికొచ్చిన పంట నీట మునగడంతో చాలామంది రైతులు నష్టపోయారని వారికి ప్రభుత్వ పరంగా నష్టపరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో బిజేపి రైతుల పక్షాన ఆందోళన చేపడుతుందని హెచ్చరించారు.